Sunday 14 September 2008

పొగమంచు రాత్రి

పొగమంచు రాత్రి



ఆకాశం పొగమంచులా కరిగిపోతోంది

అక్కడక్కడ గూళ్ళలో దీపాలు

మాట్లాడుకుంటున్నాయి

రోడ్లమీది,వీధుల్లోని కబుర్లు ఇళ్ళలోదూరి

వెచ్చటి దుప్పట్ల కింద ముడుచుకు పడుకున్నాయి

రోడ్డుచివరి కుష్టురోగ బిచ్చగాడి

కురుపుల సలుపు మాత్రం చీకటిలో

మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ తిరుగుతోంది

అప్పుడప్పుడు కప్పలు చలిచలిగా

బెకబెకలాడుతున్నాయి.

నేనుమాత్రం కిటికి ప్రక్కన,

కళ్ళతో చీకటిని తింటూ -

నా ఆలోచనల సిగరెట్టు పొగలా కరుగుతోంది

నా చూపుల పాదాలు కిటికీ చువ్వలగుండా

నడుచుకుంటూ వెళ్లి రెండు నిలువుల లోతు

చీకటిలో కూరుకు పోయాయి .

చీకటి గడియారం గంటల్లా

కరిగిపోతోంది .

ఎక్కడో దూరంగా వేకువ కోడై కూసింది

తూర్పున వెలుతురు బాకై దూసింది

మనిషి యంత్రం ఆడడం మొదలైంది .












No comments: